Missing Samosas | సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. సమోసాలు పోయాయని ఏకంగా సీఐడీతో విచారణ చేయిస్తున్నది. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు, వెక్కిరింతలు వస్తున్నాయి. అక్టోబర్ 21న సిమ్లాలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసమని సీఐడీ మూడు బాక్సుల సమోసాలను ఆర్డర్ ఇచ్చింది.
అయితే, ఈ సమోసాలు కార్యక్రమం వద్దకు రాకుండానే దారిమళ్లాయి. దీంతో సీఐడీ ఉన్నతాధికారులు ఈ అంశంపై విచారణ జరిపిస్తున్నారు. ఈ విచారణపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సమోసాలపై సీఐడీ విచారణ చేపట్టడం తెలివి తక్కువ తనమని, ప్రజా వ్యతిరేకమని మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విమర్శించారు. ‘సమోసాలు పోయాయని ఉన్నతాధికారులతో విచారణ చేపట్టడం హస్యాస్పదం. పలు శాఖల్లో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వాటిపై దృష్టి పెట్టాలి.’ అని బీజేపీ ఎమ్మెల్యే సత్పాల్ సింగ్ సట్టి పేర్కొన్నారు.
సీఐడీ సిబ్బంది దుష్ప్రవర్తనపైనే విచారణ జరుగుతున్నదని, కానీ సమోసాలపై అంటూ వార్తలు ప్రసారం చేస్తున్నారని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు పేర్కొన్నారు. కాగా, ఇది పూర్తిగా సీఐడీ అంతర్గత వ్యవహారమని, రాజకీయం చేయొద్దని సీఐడీ డీజీ సంజీవ్ రంజన్ ఓఝా పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి సమోసాలు తినరు. మేము ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. కేవలం ఏం జరిగిందో తెలుసుకోవాలని మాత్రమే చెప్పాం.’ అని ఆయన పేర్కొన్నారు.