రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren) గురువారం ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అచ్చం ఆయన మాదిరిగా ఉన్న మరో ‘హేమంత్ సోరెన్’ను కలిసినట్లు ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫొటో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ఫొటోలో అసలైన జార్ఖండ్ సీఎం ఎవరు? అన్నది పోల్చుకోవడం కష్టంగా ఉన్నదని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్, సీఎం హేమంత్ సోరెన్‌ను థియేటర్ ఆర్టిస్ట్ మున్నా లోహ్రా కలుసుకున్నారు. అచ్చం తన మాదిరిగా ఉన్న ఆయనతో రాంచీలోని నివాసంలో సీఎం హేమంత్ ఫొటోలు దిగారు. వాటిని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఒక హేమంత్ మరొక హేమంత్‌ను కలిశాడు. థియేటర్ ఆర్టిస్ట్ మున్నా లోహ్రా, ఆయన కుటుంబాన్ని కలుసుకున్నా’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, సీఎం హేమంత్ సోరెన్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందని మున్నా లోహ్రా తెలిపారు. ఆయనను పోలి ఉండటం తన అదృష్టమని చెప్పారు. ముఖ్యమంత్రికి తాను వీరాభిమానినని, ఆయనను ఆదర్శంగా భావిస్తున్నానని రాంచీలోని హతియా ప్రాంతానికి చెందిన మున్నా అన్నారు. రంగస్థల కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎంతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఈ కళాకారులకు మెరుగైన సదుపాయాలు, విధానాలు కల్పిస్తామని హేమంత్ సోరెన్ హామీ ఇచ్చినట్లు మీడియాతో అన్నారు.
एक हेमन्त की दूसरे हेमन्त से मुलाक़ात।
रंगमंच के सधे हुए कलाकार श्री मुन्ना लोहरा एवं उनके परिवार से मुलाकात एवं लंबी बातचीत हुई। pic.twitter.com/EsX9kilQux
— Hemant Soren (@HemantSorenJMM) September 25, 2024