పాట్నా: బీహారీలు బాగా పనిచేస్తున్నప్పుడు, బీహార్ ఎందుకు వెనుక ఉంది? అని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మనం సమాధానం వెతకాలని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడైన చిరాగ్ పాశ్వాన్, ఆ రాష్ట్ర సమస్యలపై శనివారం స్పందించారు. పీటీఐతో మాట్లాడిన ఆయన బీహార్‌లో పెరుగుతున్న నేరాలు, వలసలపై ఆందోళన వ్యక్తం చేశారు. వలసలను అరికట్టడానికి సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగడానికి ఒక విజన్ అవసరమని స్పష్టం చేశారు. ‘సమస్య ఏమిటంటే, ఒక విజన్ ఉండాలి. దానిని అమలు చేయాలి’ అని మీడియాతో అన్నారు.
కాగా, బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదా డిమాండ్‌కు తాను మద్దతు ఇస్తున్నట్లు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. అయితే నీతి ఆయోగ్ సిఫార్సులు ఈ డిమాండ్‌కు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ వంటి ప్రత్యామ్నాయం ఇవ్వాలని ఆయన అన్నారు.
మరోవైపు బీహార్‌లో ఇటీవల 15 వంతెనలు కూలడంపై చిరాగ్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన సమస్య అని తెలిపారు. ‘ఎక్కడో అవినీతి జరిగింది. రాజీ కుదిర్చారు. అప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారన్న దానిపై రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం. అలా జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎవరు బాధ్యులైనా బాధ్యత వహించాలి, శిక్షించాలి. తద్వారా భవిష్యత్తుకు ఒక ఉదాహరణ ఏర్పడుతుంది’ అని అన్నారు.