WhatsApp | యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈసారి మరో కొత్త అప్డేట్తో వచ్చేస్తున్నది. ఇకపై ఫోన్ నంబర్‌తో పనిలేకుండా యూజర్నేమ్తోనే మెసేజ్‌లు పంపేలా సరికొత్త ఫీచర్‌ను జోడించబోతున్నది. కొత్త వ్యక్తికి మన నంబర్ ఇచ్చేందుకు సంకోచించే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
అయితే, యూజర్ నేమ్ చెప్పే సమయంలో మన నాలుగు అంకెల పిన్ నంబర్‌ను కూడా చెప్పాల్సి ఉంటుంది. దీనిని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మనమిచ్చే యూజర్ నేమ్‌తోపాటు ఆ పిన్ నంబర్‌ను ఎంటర్ చేస్తేనే అవతలి వ్యక్తి మనకు మెసేజ్ చేయడం వీలవుతుంది. అయితే, ఇప్పటికే మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వారికి మాత్రం ఇదేమీ వర్తించదు. వారు యథావిధిగానే చాటింగ్, మెసేజ్‌లు కొనసాగించవచ్చు. యూజర్ల ప్రైవసీకి మరింత రక్షణ కల్పించడంలో భాగంగానే వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకుంది.