న్యూఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు అప్పగించే సమయంలో రాసే ఫామ్(చలాన్)ను పశ్చిమ బెంగాల్ పోలీసులు సుప్రీంకోర్టుకు సమర్పించలేదు. ఈ అంశంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. అయితే, పోస్టుమార్టంకు అప్పగించేటప్పుడు మృతదేహంతో పాటు ఏయే వస్తువులను వైద్యులకు ఇస్తున్నారనేది రాసే చలాన్ కనిపించడం లేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చలాన్ ఏమైందని పశ్చిమ బెంగాల్ తరపు న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించగా, తన వద్ద ఉన్న డాక్యుమెంట్లలో లేదని చెప్పారు. ఈ చలాన్ కనిపించడం లేదంటే, ఏదో తప్పు జరిగి ఉంటుందని భావించాల్సి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సమాధానం చెప్పాలని సీబీఐ, బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిరసన చేస్తున్న వైద్యులు సోమవారం సాయంత్రం 5 గంటల కల్లా విధుల్లో చేరాలని కోర్టు సూచించింది.
అన్ని కొవిడ్ వేరియంట్లను ఎదుర్కొనే యాంటీబాడీ!
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఇప్పటివరకు పుట్టుకొచ్చిన కొవిడ్ వైరస్‌లన్నింటి నుంచి రక్షణ కల్పించే ‘సార్వత్రిక టీకా’ తయారీ దిశగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. అన్ని రకాల కొవిడ్ వేరియంట్లను ఎదుర్కొనే యాంటీబాడీలను పరిశోధకులు గుర్తించారు. కరోనా పేషెంట్ల ప్లాస్మా నుంచి సేకరించిన ‘ఎస్సీ27’ యాంటీబాడీ.. అన్ని రకాల వేరియంట్లను ఎదుర్కొంటున్నదని పరిశోధకులు తెలిపారు. ‘ప్రస్తుతం, భవిష్యత్తులో వచ్చే వైరస్ల నుంచి మానవాళిని రక్షించేందుకు ఎస్సీ27, ఇతర యాంటీబాడీల ఆవిష్కరణ ఎంతగానో దోహదపడుతుంది’ అని పరిశోధకుడు జాసన్ లావిండర్ చెప్పారు.