భూపాల్: త్విషా శర్మ(Twisha Sharma) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కట్నం వేధింపులు భరించలేక ఆమె మృతిచెందినట్లు అనుమానిస్తున్నారు. నోయిడాకు చెందిన త్విషా శర్మ వయసు 33 ఏళ్లు. ఎంబీఏ చదువుకున్నది. గతంలో ఆమె అనేక సార్లు అందాల పోటీల్లో పాల్గొన్నది. భూపాల్‌లోని కటారా హిల్స్‌లో ఉన్న అత్తగారింట్లో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి చేసుకున్న కేవలం 5 నెలల్లోనే ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం శోచనీయంగా మారింది. వరకట్న వేధింపులు, మానసిక వేదన, మోసం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
నోయిడాకు చెందిన త్విషాకు.. భూపాల్‌కు చెందిన అడ్వకేట్ సమర్త్ సింగ్‌తో 2025 డిసెంబర్లో పెళ్లి జరిగింది. 2024లో ఓ డేటింగ్ యాప్ ద్వారా ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. త్విషాకు ఎంబీఏ డిగ్రీ ఉన్నది. పెళ్లికి ముందు ఆమె మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగంలో పనిచేసింది. అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. మిస్ పూణె టైటిల్ కూడా గెలుచుకున్నది. కార్పొరేట్ కెరీర్‌తో పాటు తెలుగు, హిందీ చిత్రాల్లో కూడా ఆమె నటించింది. సర్టిఫైడ్ యోగా శిక్షకురాలు కూడా. మే 12వ తేదీన అత్తారింట్లో ఆమె ఉరి వేసుకున్నది. ఈ కేసును పోలీసులు సూసైడ్‌గా భావించారు. కానీ అత్తింటివారి వేధింపుల వల్లే త్విషా మృతిచెందినట్లు ఆమె తల్లి ఆరోపించారు. త్విషా అత్త పేరు గిరిబాలా సింగ్. ఆమె రిటైర్డ్ జడ్జీ. ఆమెపై వరకట్న వేధింపుల కేసు బుక్ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కూడా కేసు పెట్టారు.
త్విషా భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టిస్తే పది వేలు ఇస్తామని భోపాల్ పోలీసులు ప్రకటించారు. ముందస్తు బెయిల్‌ను భోపాల్ కోర్టు నిరాకించింది. అయితే ఈకేసులో పోలీసులకు ఆందోళన కలిగించే ఛాటింగ్ వివరాలు తెలిశాయి. వేధింపులు కూడా జరిగినట్లు గుర్తించారు. ప్రాణాలు తీసుకోవడానికి ముందు ఆమె చేసిన ఛాట్స్, మెసేజ్‌లు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. తాను ట్రాప్ అయినట్లు తన స్నేహితులు, బంధువులకు ఆమె మెసేజ్ చేసింది. పెళ్లి తర్వాత అదే పనిగా తనను మానసికంగా వేధించినట్లు ఆమె పేర్కొన్నది. ఇటీవల 15 కిలోలు తగ్గినట్లు ఆమె తన మెసేజ్‌లో చెప్పింది. మే 15వ తేదీన పర్మనెంట్‌గా నోయిడాకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నట్లు కూడా తెలిపింది.
పెళ్లి తర్వాత ఆస్తులను ట్రాన్స్ఫర్ చేయాలని త్విష భర్త వత్తిడి తెచ్చారని ఆమె సోదరి ఆరోపించింది. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశాడట. తన కూతురికి ఢిల్లీ ఎయిమ్స్‌లో అటాప్సీ చేయించాలని త్విష తండ్రి కోరారు. భోపాల్‌లోని ఎయిమ్స్‌లో పోస్టు మార్టమ్ నిర్వహిస్తున్న సమయంలో ఆమె ఉరివేసుకున్న బెల్టును ప్రదర్శించలేదు. ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పోలీసులకు చెప్పకుండా త్విష బాడీని ఎలా ఆస్పత్రికి తీసుకెళ్లారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును చేధించేందుకు సిట్‌ను ఏర్పాటు చేశారు. అబార్షన్ చేయించుకునేలా త్విషను వత్తిడి చేశారని ఆమె ఫ్యామిలీ ఆరోపించింది.