న్యూఢిల్లీ: నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు, నిరసనలలో మరణించిన 700-750 మంది రైతుల కుటుంబాల సంగతేంటి? అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించిందని ఆరోపించారు. వ్యవసాయ రంగంలో వాళ్లు ఓడిపోయారని, ఎన్నికల్లో కూడా ఓటమిని చవిచూస్తారని ఆయన విమర్శించారు.
అయితే, కరెంటు రేట్లు తగ్గించి, కొత్త విధానంతో ఎంఎస్పీ అమలు చేసేంత వరకు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవని లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. రైతులను మభ్యపెట్టడానికే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని, కానీ ప్రజలను మోసం చేయలేరని విమర్శించారు. రైతులకు అన్నీ తెలుసన్న ఆయన, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.