
చెన్నై: తమిళనాడులో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 10న తమిళనాడు వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ను ( Mega vaccination ) నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటుచేసి, ఒకే రోజు 33 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.
దేశంలో వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తమిళనాడులో 64 శాతం మంది సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, రెండు డోస్‌లు తీసుకున్న వారి సంఖ్య 22 శాతంగా ఉన్నదని సుబ్రమణియన్ చెప్పారు. ఈ అక్టోబర్ నెల ఆఖరుకల్లా రాష్ట్రంలో 70 నుంచి 75 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు.