కోల్‌కతా: కోల్‌కతాలో వైద్యురాలి అత్యాచారం ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రేపిస్టులకు కఠినమైన శిక్షను విధించాలని సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) తెలిపారు. దీని కోసం వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆ సమావేశాల్లో బిల్లును పాస్ చేస్తామని, రేపిస్టులకు మరణశిక్ష పడేలా ఆ బిల్లును రూపొందిస్తున్నట్లు దీదీ తెలిపారు. ఆ బిల్లును గవర్నర్‌కు పంపిస్తామని, ఒకవేళ గవర్నర్ బిల్లును ఆమోదించకుంటే, అప్పుడు తాము రాజ్‌భవన్ ఎదుట ధర్నా చేయనున్నట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. ఇలాంటి బిల్లును గవర్నర్ పాస్ చేయాల్సిందే అని, ఇలాంటి వాటి నుంచి తప్పించుకోలేరని ఆమె చెప్పారు.
ట్రైనీ వైద్యురాలి రేప్, మర్డర్ కేసును .. ప్రస్తుతం సీబీఐ విచారిస్తున్నది. అయితే ఆ కేసును సీబీఐ టేకోవర్ చేసుకుని 16 రోజులు అవుతోందని, న్యాయం జరగలేదని మమతా బెనర్జీ ఆరోపించారు. తృణమూల్ పార్టీ స్టూడెంట్ వింగ్ వ్యవస్థాపక వేడుకలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కేసును చేధించేందుకు అయిదు రోజుల సమయం అడిగానని,కానీ ఆ కేసును సీబీఐకి అప్పగించినట్లు చెప్పారు. న్యాయం కావాలని వాళ్లకు లేదని, కేసును జాప్యం చేయాలని చూస్తున్నారని, ఇప్పటికే 16 రోజులైందని, ఇక న్యాయం ఎక్కడ ఉందని ఆమె అడిగారు.