న్యూఢిల్లీ, కోల్‌కతా, జూలై 27: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను మాట్లాడటం ప్రారంభించిన ఐదు నిముషాల తర్వాత తన మైక్రోఫోన్‌ను ఆపేశారని, అదే సమయంలో మిగతా సీఎంలు చాలాసేపు ప్రసంగించడానికి అనుమతి ఇచ్చారని తెలిపారు. ‘ఇది చాలా అవమానకరం. ఇక ముందు జరిగే సమావేశాలకు హాజరు కాబోను’ అని ఆమె స్పష్టం చేశారు.
మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపడేశారు. ‘ఆమె మైక్‌ను నిలపివేశారనడం పూర్తి అబద్ధం. ఆమె తనకు కేటాయించిన పూర్తి సమయాన్ని వినియోగించుకున్నారు.’ అని ఆమె అన్నారు. కాగా, మైక్ కట్ చేయలేదని, సమయం ముగిసినట్టు మాత్రమే గడియారం చూపిందని అధికారులు తెలిపారు. మమతకు జరిగిన అవమానంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ విపక్ష పార్టీల పట్ల కేంద్రం శత్రువుల్లా వ్యవహరించరాదని అన్నారు.
అభివృద్ధి చెందిన దేశంగా 2047 నాటికి భారత్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంపై ఈ సమావేశం దృష్టి సారించినట్టు ప్రధాని మోదీ చెప్పారు. ‘వికాస్ భారత్@2047 ప్రతి భారతీయుడి లక్ష్యం. ప్రజలతో నేరుగా అనుసంధానమై ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ర్టాలు క్రియాశీలక పాత్ర పోషించాలి’ అని అన్నారు.
నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరు కాలేదు.