కోల్‌కతా, జూన్ 9 : టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చీలిపోయి ప్రత్యేక కూటములుగా ఏర్పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేల ఫోర్జరీ కేసులో భాగంగా సీఐడీ అధికారులు మంగళవారం మమతా బెనర్జీ ఇంట్లో, పార్టీ కేంద్ర కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. బెంగాల్ ప్రతిపక్ష నేత హోదా కోసం అసెంబ్లీ స్పీకర్‌కు సమర్పించిన లెటర్లో తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ రెబల్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో భాగంగా అభిషేక్ బెనర్జీకి ఇప్పటికే సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు సీఐడీ అధికారులు మమతా బెనర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మమతా బెనర్జీ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో భేటీలో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.