బాలియా: కోల్కతాలోని ఆర్జీ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల పీజీ డాక్టర్ అత్యాచారం, హత్యకు గురైన ఘటనపై .. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ తల్లి(Nirbhayas Mother) ఆశాదేవి స్పందించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అఘాయిత్యాలను నిలువరించడంలో సీఎం దీదీ విఫలమైనట్లు ఆమె ఆరోపించారు. నిందితులను శిక్షించడానికి బదులుగా .. సీఎం మమతా బెనర్జీ నిరసన ప్రదర్శనలతో .. రేప్ ఘటనను డైవర్ట్ చేస్తున్నట్లు ఆశాదేవి ఆరోపించారు.
ఆగస్టు 9వ తేదీన ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ రేప్, హత్యకు గురైంది. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రేప్ ఘటన నుంచి డైవర్ట్ చేసేందుకు దీదీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆశాదేవి ఆరోపించారు. ఆమె కూడా మహిళే అని, రాష్ట్ర సీఎంగా ఉన్న ఆమె నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పరిస్థితిని చక్కదిద్దడంలో ఆమె విఫలమైందని, అందుకే సీఎం రాజీనామా చేయాలని ఆశాదేవి డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేపిస్టులకు కఠిన శిక్షను అమలు చేయాలని, లేదంటే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. కోల్కతా మెడికల్ కాలేజీలో అమ్మాయిలకు రక్షణ లేకుంటే, అప్పుడు దేశంలోని మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. ట్రైనీ డాక్టర్ రేప్, హత్య కేసులో బెంగాల్ పోలీసులు ఒకర్ని అరెస్టు చేశారు. ఆ కేసును ప్రస్తుతం సీబీఐకి బదిలీ చేశారు.