Pahalgam : రెండు రోజుల క్రితం పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రదాడి (Terror attack) పై అక్కడి హోటల్స్ అండ్ ఓనర్స్ అసోషియేషన్ (Hotels and Owners Association) స్పందించింది. అసోషియేషన్ అధ్యక్షుడు జావీద్ బుర్జా (Javeed Burza) మాట్లాడుతూ.. ఆ ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పాడు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని కాల్చిచంపడం అమానవీయమని, తమ ప్రాంతంలో ఇలాంటి అమానవీయ దాడి జరగడం తమకు సిగ్గుచేటని అతను పేర్కొన్నాడు.
‘నేను ఈ అమానవీయ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. అమాయకులు మరణించారు. ఈ దాడిని ఎట్టిపరిస్థితుల్లో సహించలేం. ఇలాంటి దాడులు మాకు సిగ్గుచేటు’ అని బుర్జా వ్యాఖ్యానించాడు. దాడుల్లో మరణించిన వాళ్లకు ఉగ్రవాదంతోగానీ, రాజకీయాలతోగానీ ఎలాంటి సంబంధం లేదని, వాళ్లు కేవలం విహారం కోసం ఇక్కడికి వచ్చారని, అలాంటి అమాయకులను కాల్చిచంపడం దారుణమని అన్నాడు.
మంగళవారం మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోగల బైసరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. మహిళలు, పిల్లలను విడిచిపెట్టి పురుషులను కాల్చిచంపారు. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారతీయులు కాగా, ఒకరు మాత్రం నేపాల్ జాతీయుడు ఉన్నాడు.