శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడంపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) స్పందించారు. ఈ సంఘటనతో తమతోపాటు కశ్మీరీలు సిగ్గుపడుతున్నారని తెలిపారు. గత కొన్నేళ్లుగా కశ్మీర్లో పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటని అన్నారు. బుధవారం శ్రీనగర్‌లో పీడీపీ కార్యకర్తలతో కలిసి మెహబూబా ముఫ్తీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘ఇది మనందరిపై దాడి, అమాయకులను చంపడం భయానక చర్య, అమాయకుల హత్యలను ఆపండి’ అని రాసి ఉన్న ప్లకార్డులను కార్యకర్తలు ప్రదర్శించారు.
కాగా, నిరసన ర్యాలీ తర్వాత మెహబూబా ముఫ్తీ మీడియాతో మాట్లాడారు. ఉగ్రదాడి అమాయక పర్యాటకులపైనే కాదని, కశ్మీరియత్పై కూడా జరిగిందని తెలిపారు. ‘ఇది మాపై జరిగిన దాడి. మేం దీనిని ఖండిస్తున్నాం. దీనిని సహించబోం. హోం మంత్రి ఇక్కడ ఉన్నారు. దాడిలో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులను గుర్తించాలి. అప్పుడు వీలైనంత త్వరగా శిక్షించవచ్చు’ అని అన్నారు.
మరోవైపు సరదాగా గడిపేందుకు కశ్మీర్‌కు వచ్చే అమాయక పర్యాటకులపై ఉగ్రదాడి చేయడం అత్యంత పిరికి పని అని మెహబూబా ముఫ్తీ విమర్శించారు. ‘మేం సిగ్గుపడుతున్నాం. కశ్మీరీలు సిగ్గుపడుతున్నారని దేశ ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నా. ఈ బాధాకరమైన సమయంలో మేం మీకు అండగా ఉంటాం. నేరస్తులను ప్రభుత్వం పట్టుకుని శిక్ష విధించాలని మేం కోరుతున్నాం’ అని అన్నారు.
కాగా, ఉగ్రదాడి భద్రతా లోపమా అన్న ప్రశ్నకు, రాజకీయాలు ఆడటానికి ఇది సమయం కాదని మెహబూబా ముఫ్తీ తెలిపారు. ‘మా హృదయాలు బాధలో ఉన్నాయి. ప్రజల హృదయాలు పగిలిపోయాయి. జమ్ముకశ్మీర్, దేశం మొత్తం శోకసంద్రంలో ఉన్నది. ప్రియమైన వారిని కోల్పోయిన వారి బాధను మేం పంచుకుంటున్నాం. దేశ ప్రజలకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా’ అని అన్నారు.