న్యూఢిల్లీ, జూలై 30: తాము అధికారంలోకి వస్తే విపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకొంటున్న దర్యాప్తు సంస్థలను తొలగిస్తామని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఇండియా కూటమి నేతలతో కలిసి ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. కష్టకాలంలో ధైర్యంగా పోరాడుతున్న ఆప్ కార్యకర్తలకు తమ పార్టీ అండగా ఉంటుందని అఖిలేశ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాల గొంతును అణచివేయాలని చూస్తున్నదని ఇండియా కూటమి నాయకులు ఆరోపించారు. రావుస్ కోచింగ్ సెంటర్ ఘటనలో ముగ్గురు విద్యార్థుల మృతికి కేంద్రమే కారణమని వారు దుయ్యబట్టారు. కుట్రలో భాగంగా ఆప్‌ను అంతం చేయాలని, ఢిల్లీ ప్రభుత్వాన్ని బలహీనపరచాలని కేంద్రం భావిస్తున్నదని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడు దీపాంకర్ భట్టాచార్య అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం ప్రజలకు దూరమైపోయిందని సీపీఐ జనరల్ సెక్రటరీ రాజా విమర్శించారు. కేజ్రీవాల్ షుగర్ స్థాయిలు తగ్గిపోయాయని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్‌రాయ్ తెలిపారు. కేజ్రీవాల్‌ను జైల్లోనే చంపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.