న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ కట్టడి కోసం శుక్రవారం నుంచి వీకెండ్ కర్ఫ్యూ విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
కరోనా వైరస్ కేసులు ప్రబలుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని యోచిస్తోంది. అత్యవసర సేవల విభాగంలో పనిచేసే ఉద్యోగులు మినహా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా, డిసెంబర్ నెలాఖరు నుంచి ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. సోమవారం దేశ రాజధానిలో ఏకంగా 4099 కొవిడ్-19 కేసులు వెలుగుచూడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
గత రెండురోజులుగా నమోదవుతున్న కేసుల్లో 84 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వేనని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరగడం కొనసాగితే మరికొన్ని నియంత్రణలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. బెడ్ ఆక్యుపెన్సీ పెరిగితే ఎలాంటి కఠిన నియంత్రణలు చేపట్టాలనే దానిపై నిపుణుల కమిటీ పరిస్ధితులను పర్యవేక్షిస్తోందని చెప్పారు.