Weather Update | దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పర్వత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పర్వత ప్రాంతాలకు దూరంగా ఉండాలని.. శుక్రవారం వరకు మైదాన ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ ధనంజయ్ మహాపాత్ర తెలిపారు.
ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే కొద్ది రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో రానున్న మూడు రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం జారీ చేసిన హెచ్చరికలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని, ఆ తర్వాత రుతుపవనాల పరిస్థితులను బట్టి వాతావరణశాఖ తర్వాత అలెర్ట్‌ను జారీ చేస్తుందన్నారు.
జులైలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతదేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. అసోంలో వరదలపై సీఎం హిమంత బిశ్వశర్మతో అమిత్‌షాతో మాట్లాడి పరిస్థితిపై చర్చించారు.
అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా.. తక్షణ సహాయం అందించేందుకు హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. అసోం, మహారాష్ట్ర తరహాలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బృందం ఎప్పటికప్పడు పరిస్థితిపై ఆరా తీస్తున్నది. ఎన్డీఆర్ఎఫ్, ఇతర ఏజెన్సీలను రాష్ట్రాల్లో మోహరించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.