న్యూఢిల్లీ: ఉత్తరాది(North India)లో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షం పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి వాన కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన గాలులు వీచాయి. అయితే ఇవాళ మొత్తం మేఘాలు కమ్ముకుని ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం 4.50 నిమిషాలకు భారతీయ వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొన్నది. నరేలా, బవానా, అలిపుర్, బురారి, ఖాంజావాలా, రోహిణి, బద్లీ, మోడల్ టౌన్, ఆజాద్‌పూర్, పీతంపుర, ముండ్కా, పశ్చిమ్, విహార్, పంజాబీ బాగ్, రాజౌరి గార్డెన్, జాఫర్పుర్, నజాఫ్‌ఘర్, ద్వారక ప్రాంతాల్లో వర్షం పడనున్నది. అతిశీతల గాలులు కూడా వీయనున్నాయి. వర్షం వల్ల ఢిల్లీతో పాటు సమీప ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నాయి.
#WATCH | Gusty winds and light rain in Delhi as IMD predicts light rain in the national capital pic.twitter.com/XML2pHQaIA
— ANI (@ANI) January 23, 2026
ఇక కశ్మీర్లో మంచు కురిసింది. గుల్మార్గ్తో పాటు కశ్మీర్ లోయలో అనేక ప్రాంతాల్లో మంచు దుప్పటి పరుచుకున్నది. శ్రీనగర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో అతివేగంగా శీతల గాలులు వీస్తున్నాయి. గురువారం సాయంత్రం నుంచి బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్లో కొత్తగా మంచు పడింది. మధ్యధరా ప్రాంతం నుండి వచ్చే బలమైన అల్పపీడనం వల్ల వాతావరణ మార్పు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. భీకరంగా మంచు కురవడంతో శ్రీనగర్ విమానాశ్రయం మంచుతో నిండిపోయింది. ఫ్లయిట్ ఆపరేషన్స్ అన్నీ స్తంభించిపోయాయి. రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. శ్రీనగర్ నుంచి జమ్మూ వెళ్లే రోడ్డు స్నోతో నిండిపోయింది. హిమాచల్‌లోని మనాలీలో కూడా స్నో కురుస్తోంది.