Delhi Blast | ఢిల్లీ పేలుడు (Delhi Blast) ఘటనపై అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అరెస్టైన టెర్రర్ వైద్యులను విచారిస్తున్నారు. ఈ విచారణలో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ (White Collar terror module) కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడి తరహాలో ఢిల్లీలోని రద్దీ ప్రదేశాల్లో దాడులకు కుట్ర పన్నినట్లు తేలిన విషయం తెలిసిందే. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
హమాస్ తరహాలోనే (Hamas Like Plan) ఆయుధాలను దాచేందుకు ఈ వైట్ కాలర్ ఉగ్ర ముఠా ఆసుపత్రులను (Weapons In Hospitals) ఎంచుకున్నట్లు తేలింది. ఇజ్రాయెల్‌తో యుద్ధం సమయంలో గాజాలోని పలు ఆసుపత్రుల కింద హమాస్ స్థావరాలు బయటపడిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున పేలుడు పదర్థాలు, ఆయుధాలను ఆసుపత్రుల (Gaza hospitals) కింద డంప్ చేసినట్లుగా ఐడీఎఫ్ గుర్తించింది. అదే తరహాలో జమ్ము ఆసుపత్రుల కింద ఆయుధ డంప్‌ను ఏర్పాటు చేసేందుకు వైట్ కాలర్ టెర్రర్ కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు.
ఢిల్లీ పేలుడు, ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధం ఉన్న వైద్యులు మొహమ్మద్ షకీల్, అదిల్ అహ్మద్ రాథర్, షాహీన్ సయీద్‌ను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో షకీల్, షాహీన్ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇక అహ్మద్ రాథర్ మాత్రం జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగి. అతడిని విచారించగా ఈ ఆయుధ డంప్ కుట్ర విషయం బయటపడింది. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాలను దాచేందుకు అనంత్‌నాగ్, శ్రీనగర్, బారాముల్లా, బుద్గాం, నౌగమ్లోని ఆసుపత్రులను ఈ ఉగ్ర మాడ్యూల్ పరిశీలించినట్లు దర్యాప్తులో తేలినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
మరోవైపు ఈ కేసు దర్యాప్తులో హమాస్ తరహాలో డ్రోన్లతో దాడులకు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎర్ర కోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడికి ముందు ఈ ఉగ్ర ముఠా భారీ ఆయుధాలతో కూడిన డ్రోన్లతో రద్దీ ప్రదేశాల్లో దాడులు చేయాలని ప్రణాళిక రచించింది. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడి తరహాలో దాడులకు పాల్పడాలని వీరు ప్రయత్నించారు. సూసైడ్ బాంబర్, డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో కలిసి పని చేసిన జసిర్ బిలాల్ వానీ వురపు డానిష్ ఈ భయానక వివరాలను వెల్లడించాడు.
ఇతనిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం శ్రీనగర్‌లో అరెస్ట్ చేసింది. కారు బాంబు పేలుడుకు ముందే, డ్రోన్లకు భారీ ఆయుధాలను అమర్చి, రాకెట్లను తయారు చేసి, రద్దీ ప్రదేశాల్లో దాడులకు పాల్పడేందుకు సాంకేతిక సహకారాన్ని డానిష్ అందించాడని ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. సూసైడ్ బాంబర్ ఉమర్‌తో సహ కుట్రదారుగా డానిష్ పని చేసినట్లు తెలిపింది. మీడియా కథనాల ప్రకారం, పెద్ద బ్యాటరీలతో అత్యంత శక్తిమంతమైన బాంబులను తీసుకెళ్లగలిగే డ్రోన్లను తయారు చేయడానికి డానిష్ ప్రయత్నించాడు. ఆయుధాలతో కూడిన డ్రోన్లను తయారు చేయడంలో అతనికి అనుభవం ఉంది. రద్దీ ప్రదేశాల్లో డ్రోన్ల దాడి చేయాలని నిందితులు ప్రయత్నించారు.
Also Read..
Ammonium Nitrate: అమోనియం నైట్రేట్ అమ్మకాలు రికార్డు చేయండి.. ఢిల్లీ పోలీసులకు ఆదేశం
Earthquake | బంగ్లాదేశ్‌లో భారీ భూకంపం.. టెస్ట్ మ్యాచ్‌కు అంతరాయం.. భారత్‌లోనూ ప్రకంపనలు