న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద కారు పేలుడు ఘటన జరిగిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. సిటీలో భద్రతను పెంచేందుకు చర్యలు చేపట్టాలని పోలీసు కమీషనర్, చీఫ్ సెక్రటరీని ఆయన ఆదేశించారు. అధిక మోతాదులో అమోనియం నైట్రేట్(Ammonium Nitrate) అమ్మడం, కొనడం జరిగితే, దానికి సంబంధించిన డిజిటల్ రికార్డును మెయిన్టేన్ చేయాలని ఢిల్లీ పోలీసులను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కోరారు. అమ్మేవారి, కొనేవారి ఫోటోలు ఉండాలన్నారు.
అమోనియం నైట్రేట్ రసాయాన్ని దుర్వినియోగం చేయరాదు అన్న ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకోనున్నారు. పేలుడు పదార్ధాల తయారీకి అమోనియం నైట్రేట్ రసాయనాన్ని వినియోగిస్తున్నారు. తాజాగా ఎర్ర కోట వద్ద జరిగిన కారు పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి చెందిన సెంట్రల్ డేటాను క్రియేట్ చేయాలని లెఫ్టినెంట్ జనరల్ ఆదేశించారు. మెడికల్ డిగ్రీలకు చెందిన వివరాలు ఆ డేటాబేస్లో ఉంటాయి. సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల విషయంలోనూ డేటా ఉండాలన్నారు.