Sitaram Yechury | యూపీలో తాము సమాజ్‌వాదీ పార్టీకి మద్దతిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ప్రకటించారు. యూపీలో బీజేపీని ఓడించాలంటే సమాజ్‌వాదీ పార్టీయే సరైన వేదిక అని, అందుకే తాము సమాజ్‌వాదీకి మద్దతిస్తామని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు, పొత్తు అనే అంశాలను సమాజ్‌వాదీకే వదిలేస్తామని, బీజేపీని ఓడించడానికి కలిసి కట్టుగా పనిచేస్తామని ఆయన తెలిపారు.హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నిర్మాణంతో పాటు ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల గురించి కూడా చర్చించారు. ఈ సందర్భంగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ మీడియాతో మాట్లాడారు.
ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లను కేంద్రీకృతం చేయడమే తమ ప్రధాన అజెండా అని, ఆ దిశగానే అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ ఓడించడమే తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూనే, బీజేపీ వ్యతిరేక ఓట్లను కేంద్రీకృతం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అయితే ఐదు రాష్ట్రాలకు సంబంధించిన పొత్తులపై ఆయా రాష్ట్రాల రాష్ట్ర కమిటీలతో మొదటగా మాట్లాడతామని, అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీతారాం ఏచూరీ తెలిపారు.