న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు గురువారం వికీపీడియాకు కోర్టు ధిక్కార నేరం కింద నోటీసు జారీ చేసింది. ఆసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) పిటిషన్‌పై ఈ చర్య తీసుకుంది. ఏఎన్ఐ వాదన ప్రకారం, వికీపీడియాలోని ఏఎన్ఐ ఎంట్రీ పేజ్‌లో ముగ్గురు వ్యక్తులు ఎడిట్ చేశారు. ఈ మాటలు ఏఎన్ఐకి పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయి. ఈ విధంగా ఎడిట్ చేసిన సబ్‌స్ర్కైబర్ల సమాచారాన్ని వెల్లడించాలని హైకోర్టు గతంలో వికీపీడియాను ఆదేశించింది. కానీ వికీపీడియా ఆ ఆదేశాలను పాటించలేదని ఏఎన్ఐ మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ నవీన్ చావ్లా మాట్లాడుతూ, వికీపీడియా భారత దేశపు సంస్థ ఔనా? కాదా? అనేదానితో సంబంధం లేదని చెప్పారు. “మీ వ్యాపార లావాదేవీలను భారత దేశంలో మూసివేయిస్తాం. వికీపీడియాను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. గతంలో కూడా మీరు ఇదే వాదన వినిపించారు. మీకు భారత్ అంటే ఇష్టం లేకపోతే, దయచేసి, ఇక్కడ పని చేయకండి” అని హెచ్చరించారు.