JD Vance | భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ వివాదం అమెరికాకు సంబంధించిన విషయం కాదన్నారు. అయినప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా ప్రోత్సహిస్తున్నారని.. తాము చేయగలిగేది పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ప్రోత్సహించడమేనన్నారు. కానీ, తాము యుధ్యంలో పాల్గొనబోమన్నారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తృత ప్రాంతీయ యుద్ధం.. అణుయుద్ధానికి దారితీయకూడదని.. అలా జరుగబోతోంది అనుకోమన్నారు. జమ్మూ, పఠాన్కోట్, అనేక ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ విఫల ప్రయత్నాలు చేసిన సమయంలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ – పాకిస్తాన్ మధ్య అణుయుద్ధంపై ట్రంప్ పరిపాలన ఎంత ఆందోళన చెందుతుందన్న ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు.
డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా కోరుకుంటుందని అన్నారు. భారత్కు పాకిస్తాన్తో కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ఉద్రిక్తతలను తగ్గించమని రెండు దేశాలను ప్రోత్సహించగలమని.. తాము మధ్యలో జోక్యం చేసుకోమన్నారు. అయితే, రెండు దేశాల మధ్య ప్రాంతీయ యుద్ధం అణు యుద్ధంగా మారొచ్చని వాన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది జరిగితే ఖచ్చితంగా వినాశకరమైందన్నారు. ఈ పరిస్థితి రావొద్దని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయం చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. సహాయం చేయడానికి తాను ఏదైనా చేయగలిగితే, అంతకు తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొన్నారు. భారతదేశం, పాకిస్తాన్ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం ఆపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.