న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల న్యాయ సమీక్ష విషయంలో ఉండే లక్ష్మణరేఖ గురించి తమకు తెలుసునని, అయినప్పటికీ నోట్లరద్దు వ్యవహారంపై పరిశీలన జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది కేవలం అకడమిక్ అంశంగా మిగిలిపోయిందా? అనేది తేల్చుకొనేందుకైనా పరిశీలన జరపక తప్పదని పేర్కొన్నది. 2016లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించింది. రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఏదైనా అంశం వస్తే దానిని తేల్చడం కోర్టు బాధ్యత అని జస్టిస్ ఎస్ఏ నజీర్ అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు అంశంపై సమగ్ర అఫిడవిట్లు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, భారత రిజర్వ్ బ్యాంకుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
న్యాయ పరిశీలన తప్పదు
సరైన దృక్కోణంలో నుంచి పిటిషన్ సమర్పించకపోతే నోట్ల రద్దు అనేది ప్రస్తుత తరుణంలో కేవలం అకడమిక్ అధ్యయన అంశంగానే ఉంటుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదించారు. 1978లో అప్పటి జనతాపార్టీ ప్రభుత్వం ప్రజాప్రయోజనాల దృష్ట్యా అధిక విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేసింది. అక్రమ కార్యకలాపాలకు ఆ నోట్లు ఉపకరిస్తాయనే కారణంతో అప్పటి ప్రభుత్వం అధిక విలువ కలిగిన నోట్ల రద్దుకు చట్టాన్ని తెచ్చింది. అయితే 2016 నాటి నోట్ల రద్దు అంశంపై ఉభయపక్షాలు ఏకాభిప్రాయనికి రాలేని కారణంగా అది కేవలం అకడమిక్ అంశంగా లేదా నిరర్థక అంశంగా మిగిలిపోయిందా? అనేది తేల్చేందుకు న్యాయపరిశీలన జరపక తప్పదని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొన్నది. అది అకడమిక్ అంశమా? కాదా? లేక న్యాయ పరిశీలనకు అతీతమైనదా? అనేది నిర్ణయించేందుకు విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానం, దాని వెనుకనున్న విజ్ఞత ఇక్కడ ముఖ్యాంశమని తెలిపింది.
లక్ష్మణరేఖ మాకు తెలుసు..
‘లక్ష్మణరేఖ ఎక్కడ ఉంటుంది అనేది మాకు తెలుసు.. కానీ ఏ విధంగా ఆ నిర్ణయానికి వచ్చారనేది పరిశీలించాల్సి ఉంది. అది నిర్ణయించాలంటే వాదనలు వినాల్సిందే’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, ఏఎస్ బోపన్న, వీ రామసుబ్రమణియన్, బీవీ నాగరత్న సభ్యులుగా ఉన్నారు. అకడమిక్ అంశాలపై కోర్టు సమయాన్ని వృథా చేయరాదని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. దీనిపై వివేక్ నారయణ్ శర్మ అనే పిటిషనర్ తరఫున కోర్టులో హాజరైన సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ ధర్మాసనం సమయం వృథా అనే మాటలు వినియోగించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుత కేసును రాజ్యాగం ధర్మాసనం విచారించాలని ఇదివరకు సుప్రీంకోర్టు నిర్ణయించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సమస్య అకడమిక్ పరిశోధనాంశంగా ఏమీ మారలేదని మరో పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పీ చిదంబరం అన్నారు. ఈ తరహా నోట్ల రద్దుకు పార్లమెంట్ ప్రత్యేక చట్టం చేయడం అవసరమని గుర్తుచేశారు. విచారణను ధర్మాసనం నవంబర్ 9కి వాయిదా వేసింది. ఈ సమస్యపై సాధికార నిర్ణయం కోసం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని 2016 డిసెంబర్ 16న అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించింది. తేల్చాల్సిన పలు ప్రశ్నలను వివరించింది. 2016 నవంబర్ 8న నోట్ల రద్దుకు జారీచేసిన నోటిఫికేషన్ రిజర్వు బ్యాంకు చట్టం నిబంధనలకు విరుద్ధమా? రాజ్యాంగంలోని 300 (ఏ) అధికరణాన్ని అది ఉల్లంఘిస్తున్నదా? అనేవి ఆ ప్రశ్నల్లో ఉన్నాయి. ప్రభుత్వ నోటిఫికేషన్ రిజర్వు బ్యాంక్ చట్టానికి అనుగుణంగా ఉన్నప్పటికీ రాజ్యాంగంలోని 14, 19 అధికరణాలను ఉల్లంఘిస్తుందా? అనేది పరిశీలించాల్సి ఉన్నదని అప్పటి ధర్మాసనం అభిప్రాయపడింది. ఇంకా పలు ప్రశ్నలు ఉన్నాయని, వాటన్నిటినీ ప్రజాప్రయోజనం దృష్ట్యా రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాల్సి ఉన్నదని తేల్చిచెప్పింది.