ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 80.66 శాతం పోలింగ్ నమోదైందని ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (CEO) మధుప్ వ్యాస్ చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగిందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 80.03 శాతం ఓట్లు పోలయ్యాయని, ఈసారి అది 80.66 శాతానికి పెరిగిందని తెలిపారు.
ఈ నెల 4న మిజోరంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని మధుప్ వ్యాస్ వెల్లడించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, మధ్యాహ్నానికల్లా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. కాగా, మిజోరం అసెంబ్లీకి నవంబర్ 7న పోలింగ్ జరిగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతోపాటు మిజోరంలో కూడా డిసెంబర్ 3న కౌంటింగ్ జరగాల్సి ఉండె. కానీ మిజోరం కౌంటింగ్‌ను ఈ నెల 4కు వాయిదా వేశారు.