అయోధ్య, డిసెంబర్ 7: 1992 బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో 32 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నదని బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్, అధికార ప్రతినిధి సయ్యద్ రసూల్ బుధవారం వెల్లడించారు. బాబ్రీ మసీదు కూల్చివేతను నేరపూరిత చర్యగా సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు సమయంలో పేర్కొన్నదని, ఈ నేపథ్యంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నామని పేర్కొన్నారు. మాజీ ఉపప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వాణీతో సహా 32 మందిని సీబీఐ కోర్టు 2020, సెప్టెంబర్ 30న నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. కాగా, సీబీఐ కోర్టు తీర్పుపై హజీ మెహబూబ్, సయ్యద్ అఖ్లాక్ అనే ఇద్దరు అయోధ్య నివాసితులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది నవంబర్లో తిరస్కరించింది. అప్పీలుదారులు బాధితులు కానందున తీర్పును సవాల్ చేసే హక్కు వారికి లేదని పేర్కొన్నది.