బీజింగ్, జనవరి 2: హ్యాకింగ్‌కు సాధ్యపడని క్వాంటమ్ కమ్యూనికేషన్ లింక్‌ను విజయవంతంగా పరీక్షించినట్టు చైనా, రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోదసిలోని చైనా క్వాంటం కమ్యునికేషన్ శాటిలైట్ ‘మోజి’లోని సెక్యూర్ కీలను ఉపయోగించి ‘క్వాంటం కమ్యూనికేషన్ ఎన్క్రిప్షన్’ సాధించామని వారు తెలిపారు. ‘మోజి’ శాటిలైట్‌తో క్వాంటం కమ్యూనికేషన్ సేవల పరిధి 4 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలన, ఆర్థికం, రక్షణ, వ్యూహాత్మక ఏజెన్సీలకు సురక్షితమైన, అత్యంత భద్రతతో కూడిన సమాచార వ్యవస్థ అందించేందుకు ‘మోజి’ శాటిలైట్‌ను చైనా ప్రయోగించింది. ఎవ్వరూ హ్యాక్ చేయలేని, అవరోధాలు కల్పించలేని సమాచార వ్యవస్థ ‘క్వాంటం కమ్యునికేషన్’తోనే సాధ్యమని సైంటిస్టులు భావిస్తున్నారు. దీంట్లో క్వాంటం మెకానిక్స్ ఆధారంగా సమాచారం ‘ఎన్‌క్రిప్ట్’ అవుతుంది. మధ్యలో ఎవరూ దీనిని ‘డీక్రిప్ట్’ చేయలేని విధంగా మారిపోతుంది. సున్నితమైన, అత్యంత కీలక సమాచారానికి ‘క్వాంటం కమ్యునికేషన్స్’ చాలా ముఖ్యమైందిగా చైనా, రష్యాలు భావిస్తున్నాయి.