కోల్‌కతా: లియోనల్ మెస్సీ(Messi) తన ఆటతో మాయం చేస్తాడనుకున్నారు. కానీ ప్రేక్షకులకు కనిపించకుండానే మాయం అయ్యాడు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ మెస్సీ ఆడకపోవడంతో.. ఆ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. డ్రిబ్లింగ్ స్కిల్స్‌తో దూసుకెళ్లే మెస్సీని చూద్దామని వచ్చిన అతని అభిమానులకు నిరాశ మిగిలింది. పోలీసులు, కెమెరామెన్లు, సెక్యూర్టీ సిబ్బంది మెస్సీని చుట్టేయడంతో.. సాధారణ ప్రేక్షకులకు లెజెండరీ ప్లేయర్ కనిపించలేదు. ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుదామంటే అసలు పిచ్‌లోకి వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో నిర్వాహకులు మెస్సిని సురక్షితంగా స్టేడియం నుంచి బయటకు తీసుకెళ్లారు.
వాస్తవానికి మోహన్ భగాన్, డైమండ్ హార్బర్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమై సెకండ్ హాఫ్ జరుగుతున్న సమయంలో మెస్సీ స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఫీల్డ్‌లోకి వెళ్లేందుకు యాక్సిస్ ఉన్న ప్రతి వ్యక్తి.. మెస్సీ ఆడీ కారు రాగానే ఆ వైపుగా దూసుకెళ్లారు. నలుపు దుస్తుల్లో ఉన్న మెస్సి చుట్టూ సెక్యూర్టీ పటిష్టంగా ఉంది. 15 నిమిషాల పాటు అతను గ్రౌండ్లో ఉన్నాడు. కానీ అతని చుట్టూ సిబ్బంది అంతకంతకీ పెరిగిపోయింది. టికెట్‌కు వేలు పెట్టి మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన అభిమానులకు మాత్రం మెస్సీ చూపు దూరం అయ్యింది. తమ ఫెవరేట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌ను కనీసం ఓ సెకండ్ పాటు కూడా ప్రేక్షకులు చూడలేకపోయారు.
Once again, TMC turns dreams into chaos!
This day should have been a dream come true for thousands of Messi fans of West Bengal. Instead, TMC’s leaders turned it into a nightmare.
Mark my words, this is the tipping point.
#MessiInKolkata #MessiInIndia pic.twitter.com/kAaUacq4g3
— Ashok Singhal (@TheAshokSinghal) December 13, 2025
నిర్వాహకులు సతాద్రు దత్త, బెంగాల్ మంత్రి అరూప్ బిశ్వాస్ మాత్రం మెస్సీ దగ్గరే ఉన్నారు. ప్రేక్షకులకు మెస్సీ కనిపించేలా వాళ్లు ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. మెస్సీ ఎత్తు 5.7 అంగులాలే. అయితే అతన్ని అందరూ చుట్టేయడంతో.. ఆ స్టార్ ప్లేయర్ స్టేడియంలోని జనాలకు సరిగా కనిపించలేదు. మేనేజ్మెంట్ సరిగా లేదని నిర్వాహకులపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో గందరగోళం ఏర్పడడంతో మెస్సీని అక్కడ నుంచి తప్పించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసలు స్టేడియంకు చేరుకోలేకపోయారు. కేవలం షారూఖ్ ఖాన్ మాత్రం తన కుమారుడితో కలిసి ఫోటో దిగారు.
మెస్సీని బయటకు పంపివేయడంతో.. వీ వాంట్ మెస్సీ అని స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు నినాదాలు చేశారు. ఇన్విటేషన్‌కు పిలిచినవాళ్లు రాకముందే మెస్సీని తీసుకెళ్లడం పట్ల ఫ్యాన్స్ మరింత ఆగ్రహానికి గురయ్యారు. తీవ్ర నిరాశకు గురైన అభిమానులు తమ చేతుల్లో ఉన్న బాటిళ్లను విసిరేశారు. బ్యానర్లను, హోర్డింగ్‌లను, ప్లాస్టిక్ చైర్లను చించేశారు. ప్రేక్షకులు పిచ్ మీదకు రావడంతో.. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది.
ఎగ్జిబిషన్ మ్యాచ్ టికెట్ కోసం ఫ్యాన్స్ పది వేల వరకు చెల్లించారు. కొందరు తమ నెల జీతం ఈ మ్యాచ్ కోసం ఖర్చు చేశారని ఓ అభిమాని పేర్కొన్నారు. మెస్సీని చూసేందుకు వచ్చాం, కానీ రాజకీయ నాయకుల్ని కాదు అని ఓ ఫ్యాన్ పేర్కొన్నాడు. పోలీసులు, మిలిటరీ వ్యక్తులు మాత్రం సెల్ఫీలు దిగారని, ఇది మేనేజ్మెంట్ వైఫలం అని, కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవని కొందరన్నారు.