MK Stalin | చెన్నై: డీలిమిటేషన్ అంశంపై రాజకీయ, న్యాయపరమైన ప్రణాళికను రూపొందించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రతిపాదించారు. జేఏసీ తొలి సమావేశంలో స్టాలిన్ ప్రసంగిస్తూ తదుపరి జనాభా లెక్కల ఆధారంగా రానున్న లేదా భవిష్యత్తులో నిర్వహించే నియోజకవర్గాల పునర్విభజన కొన్ని రాష్ర్టాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ సామాజిక కార్యక్రమాలు, ప్రగతిశీల సంక్షేమ పథకాల ద్వారా జనాభాను నియంత్రించిన రాష్ర్టాలు ఈ కార్యక్రమం కారణంగా పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా కోల్పోనున్నాయని ఆయన తెలిపారు.
2023లో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రచారాన్ని ఆయన ఉటంకిస్తూ, కుల గణనను నిర్వహించి జనాభా ఆధారంగా కులాల వారీగా ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, ఇక తదుపరి అడుగు డీలిమిటేషన్ అని అన్నారని స్టాలిన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టు ప్రస్తుత జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాలు మారితే దక్షిణాది రాష్ర్టాలు 100 సీట్లు కోల్పోతాయని, దక్షిణ భారత ప్రజలు దీనికి ఒప్పుకుంటారా అని ప్రధాని అడిగారని స్టాలిన్ గుర్తు చేశారు.
మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుందని ప్రధాన మంత్రే స్వయంగా అంగీకరించినట్టు అవుతుందని ఆయన అన్నారు. రాష్ర్టాల హక్కులను బీజేపీ మొదటినుంచి కాలరాస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌పై ఏర్పడిన జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)ని జేఏసీ ఫర్ ఫేర్ డీలిమిటేషన్గా మార్చాలని స్టాలిన్ ప్రతిపాదించారు.