(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): నిశిరాతిరిలో విరుచుకుపడ్డ కొండచరియల ధాటికి ముండకై గ్రామమంతా బురదమయమైంది. బురదతో కూడిన ఈ వరద ప్రవాహంలో పదుల మంది కొట్టుకుపోయారు. అలా కొట్టుకుపోయిన ఓ వ్యక్తి కొంతదూరం తర్వాత బండరాళ్ల మధ్య అనూహ్య స్థితిలో ఇరుక్కుపోయాడు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పాటు బురదలో ఇరుక్కుపోవడంతో అక్కడి నుంచి బయటపడలేకపోయాడు. కనీసం నిలబడలేని పరిస్థితుల్లో తెల్లారేవరకూ బండరాయిని పట్టుకుని అలాగే ఉండిపోయాడు.
ఉదయమే ఆ వ్యక్తిని గమనించిన కొందరు స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నాలు చేశారు. అయితే, బురదతో కూడిన వరద ప్రవాహం పెరుగడం, రాళ్లు అడ్డురావడంతో అది కుదరలేదు. అతన్ని కాపాడటం దాదాపుగా అసాధ్యమనే అందరూ అనుకొన్నారు. కాపాడాలంటూ అతను చేసిన సంజ్ఞలు అక్కడి వారిని నిలకడగా ఉండనీయలేదు. దీంతో కొందరు ఆ దృశ్యాలను ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో విషయం పై అధికారులకు తెలిసింది. దీంతో ఆ ప్రాంతానికి రెస్క్యూ బృందాలను పంపించిన ప్రభుత్వం.. అతన్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చింది.