Wayanad | వయనాడ్ విపత్తుకు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలే కారణమని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆరోపించారు. వియనాడ్ విపత్తు మానవ తప్పిదమేనన్నారు. ఇందులో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీల హస్తం ఉందని.. సర్కారు నిర్లక్ష్యం కారణంగానే భారీ విషాదం చోటు చేసుకుందని ఆరోపించారు. 2000 సంవత్సరం నుంచి పశ్చిమ కనుమల్లో అక్రమ వ్యాపారం, మైనింగ్ జరుగుతోందని పలు ప్రభుత్వ సంస్థలు, శాస్త్రవేత్తలు, ఐఐటీలు, పలు ప్యానెల్లు కేరళ ప్రభుత్వానికి నివేదించినట్లు సూర్య పేర్కొన్నారు. కానీ, ఇప్పటి వరకు అక్కడ అధికారంలో ఉన్న కేరళ ప్రభుత్వం, కాంగ్రెస్ సహా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఈ విపత్తు కాంగ్రెస్, కమ్యూనిస్టుల సృష్టేనని.. విపత్తులో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. కేరళ ప్రభుత్వం కారణాలు, పరిష్కారం ప్రయత్నించకుండా అందరినీ అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరిగిందో శాస్త్రవేత్తలకు, మీడియాకు అర్థం కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. దీన్నిబట్టి వయనాడ్ విలయం మానవ నిర్మిత.. కాంగ్రెస్-కమ్యూనిస్టులు సృష్టించిన విపత్తు అని స్పష్టమవుతోందన్నారు. ఇదిలా ఉండగా.. వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 308 మంది దుర్మరణం పాలయ్యారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ వికాస్ రాణా మాట్లాడుతూ.. వివిధ జోన్లకు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలతో పాటు శాస్త్రవేత్తలు, స్నిఫర్ డాగ్స్ సైతం ఉన్నాయి. స్థానిక ప్రజలు కూడా సహాయ, సహాయక చర్యల్లో సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.