ముంబై, మే 7: దక్షిణ ముంబైలో బిర్యానీ ఆరగించిన అనంతరం పుచ్చకాయ తిన్న తర్వాత ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించిన విషాద ఘటనలో కీలక నిజం వెలుగులోకి వచ్చింది. వారు పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్పాయిజన్ అయ్యి మరణించ లేదని, వారిపై జరిగిన విష ప్రయోగం వల్ల మరణించారని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. బాధితుల శరీరంలో, వారు తిన్న పుచ్చకాయలో ఎలుకలను చంపడానికి వినియోగించే జింక్ ఫాస్ఫైడ్ విష పదార్థ్ధాన్ని గుర్తించారు. దక్షిణ ముంబైలో నివసించే అబ్దుల్ దొకాడియా(44), అతని భార్య నస్రీన్ (35), వారి ఇద్దరు పిల్లలు ఆయేషా (16), జైనెబ్ (13)లు ఏప్రిల్ 25న రాత్రి బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు.
అక్కడ వారితో కలిసి బిర్యానీని తిన్నారు. తర్వాత రాత్రి 1 గంటకు పుచ్చకాయను తిన్నారు. ఇంటికి చేరుకున్న అనంతరం వారికి వాంతులు, విరేచనాలు కావడంతో వారిని దవాఖానకు తరలించారు. అప్పటికే వారి కుమార్తె ఒకరు మరణించగా, మిగిలిన ముగ్గురిని జేజే ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా వారు చికిత్స పొందుతూ మరణించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బిర్యానీ, పుచ్చకాయ, వారు తాగిన నీరు శాంపిళ్లు తీసుకుని పరీక్షకు పంపారు. వారు తిన్న పుచ్చకాయలో జింక్ ఫాస్ఫైడ్ విష పదార్థ ఉందని, వారి నలుగురి శరారాల్లో లభ్యమైందని పోలీసులు తెలిపారు.