లాతూర్, జనవరి 2: మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో నీటికి కటకట ఏర్పడింది. ఈ ప్రాంతంలో తక్కువ వర్షపాతం నమోదవ్వడంతో మంజర డ్యామ్‌లో నీటి నిల్వ శాతం దాని సామర్థ్యంలో 20 శాతానికి పడిపోయింది. దీంతో లాతూరులో వారానికి ఒక్కసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ వరకు ఇక్కడ వారానికి రెండు సార్లు అదీ 150 నిముషాలు చొప్పున సరఫరా చేసేవారు. అయితే దానిని వారానికి ఒకసారికి మార్చడంతో పాటు 90 నిముషాలు మాత్రమే నీటిని వదులుతున్నారని స్థానికులు వాపోతున్నారు. మంజర డ్యామ్ నుంచి లిఫ్ట్ చేసే నీటిని కూడా ఒక మిలియన్ క్యూబిక్ మీటర్లకు తగ్గించినట్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ చవాన్ తెలిపారు. 2016లో కూడా వర్షాలు కురవక లాతూరులో కరువు పరిస్థితులు ఏర్పడటంతో మహారాష్ట పశ్చిమ ప్రాంతం నుంచి ఇక్కడకు ప్రత్యేక రైలు ద్వారా నీటిని సరఫరా చేశారు.