Child Pornography | హైదరాబాద్, సెప్టెంబర్ 23 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పిల్లల అశ్లీలత, వారిపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలను చూడటం ముమ్మాటికీ నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటంతో పాటు ఆ వీడియోలను డౌన్లోడ్ చేయడం, స్టోర్ చేసుకోవడం కూడా పోక్సో చట్టం ప్రకారం నేరం కిందకే వస్తుందని పేర్కొంది. ఇలాంటి పనులకు తెగబడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదంటూ మద్రాసు హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టేసిన న్యాయస్థానం.. ఇలాంటి తీర్పునిచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిదం చేసిందని వ్యాఖ్యానించింది.
చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 ఏండ్ల ఓ యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ మద్రాసు హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. సదరు యువకుడు వీడియోలు చూడటం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకూ పంపలేదని పేర్కొంది.
పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకొన్నాడంటే, ఆ దురుద్దేశం యువకుడికి ఉందన్నది స్పష్టమవుతున్నదని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా లైంగిక విద్యపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘తల్లిదండ్రులు, అధ్యాపకులు సహా చాలా మంది శృంగారం గురించి చర్చించడం సరికాదని, అనైతికమని, ఇబ్బందికరమనే సంప్రదాయవాద భావాలు కలిగి ఉన్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పాశ్చాత్య అంశమని, సంప్రదాయ భారతీయ విలువలకు తగనిదనే భావన ఉంది. ఈ భావనతోనే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సెక్స్ ఎడ్యుకేషన్‌ను నిషేధించాయి.
ఈ రకమైన వ్యతిరేకత తో సమగ్ర, సమర్థవంతమైన సెక్స్ ఎడ్యుకేషన్ అందకపోవడం వల్ల కౌమార దశలో ఉన్న వారికి తప్పుడు సమాచారం వెళ్తున్నది. వారు ఇంటర్నెట్ వైపు వెళ్లి నియంత్రణ లేని సమాచారం పొందుతున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే కేవలం జీవపరమైన పునరుత్పత్తి మాత్రమే అనే అపార్థం ఉంది. సమర్థవంతమైన సెక్స్ ఎడ్యుకేషన్‌లో అంగీకారం, ఆరోగ్యకరమైన సంబంధాలు, లింగ సమానత్వం వంటి అంశాలు ఉండాలి. శారీరక హింసను తగ్గించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో ఇవి కీలకం’ అని జస్టిస్ పార్దివాలా పేర్కొన్నారు.