Students protest : ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులు భారీ సంఖ్యలో కరోల్‌బాగ్ మెట్రోస్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు పోవడానికి కారణమైన కోచింగ్ సెంటర్ యాజమాన్యంపైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Delhi: Students gathered at Karol Bagh Metro Station to protest against the death of 3 students after the basement of a coaching institute in Old Rajinder Nagar was filled with water yesterday. pic.twitter.com/jVIc6mhP00
— ANI (@ANI) July 28, 2024
విద్యార్థుల ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఘటనకు బాధ్యులైన రవూస్ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మరి కాసేపట్లో కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నది. కాగా, కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశమంతటా చర్చనీయాంశమైంది.
సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్‌లోగల రవూస్ సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి శనివారం సాయంత్రం భారీగా నీరు చేరింది. దాంతో సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు నీట మునిగారు. ఘటనపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది హుటాహుటిన వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 30 మంది విద్యార్థులను రక్షించారు. కానీ ముగ్గురు విద్యార్థులు మరణించారు. వారిలో ఇద్దరు యువతులు, ఓ యువకుడు ఉన్నారని అధికారులు తెలిపారు.
శనివారం సాయంత్రం 7.15 గంటలకు సమాచారం వచ్చిందని, వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలానికి వెళ్లామని ఢిల్లీ అగ్నిమాపక అధికారి అతుల్ గార్గ్ తెలిపారు. అప్పటికే సెల్లార్ మొత్తం నీటితో నిండి ఉందని, ఇద్దరు యువతులు, ఒక యువకుడి మృతదేహాలను వెలికి తీశామని వెల్లడించారు. మృతులను తానియా సోని (25), శ్రేయ యాదవ్ (25), నవీన్ డాల్విన్ (28) గా గుర్తించామని చెప్పారు.