Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టగా, తొలి రోజే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే కథ, విజువల్స్ పరంగా బాలీవుడ్లో అక్షయ్ కుమార్ నటించిన ‘భూల్ భులయ్యా’ను తలపిస్తోందన్న చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం స్పందించి స్పష్టత ఇచ్చింది. ఈ పోలికలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, ‘ది రాజా సాబ్’ను పూర్తిగా ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా రూపొందించిన ఫాంటసీ ప్రపంచమని వివరించారు.
ఇండియన్ సినిమాల్లోనే అతిపెద్ద స్టార్లలో ఒకరైన ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకుని, కథా నేపథ్యం నుంచి విజువల్ డిజైన్ వరకూ ప్రత్యేకంగా ఆలోచించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని చెప్పారు. అందుకే కథా నేపథ్యం, విజువల్ ఎలిమెంట్స్ పరంగా ఇది ఇతర సినిమాలకంటే భిన్నంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. హీరోయిన్ రిద్ధి కుమార్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ, ‘భూల్ భులయ్యా’ తనకు ఇష్టమైన సినిమాల్లో ఒకటని, అయితే ఆ చిత్రం పూర్తిగా రియలిస్టిక్ ప్రపంచంలో సాగుతుందని చెప్పారు. నిజమైన ప్రదేశాలు, సాధారణ మనుషుల మధ్య నడిచే కథతో అది ప్రేక్షకులను ఆకట్టుకుందని, ‘ది రాజా సాబ్’ మాత్రం ఫాంటసీ టచ్‌తో కూడిన విభిన్న అనుభూతిని అందిస్తుందని వివరించారు. ఇందులో సైకాలజికల్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ, కథ మొత్తం కల్పిత ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ఆమె తెలిపారు.
ఇదే విషయంపై మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా స్పందిస్తూ, ప్రేక్షకులు ముందెప్పుడూ చూడని ఫాంటసీ అనుభూతిని ఈ సినిమా అందిస్తుందని పేర్కొన్నారు. కథను కాపీగా ముద్ర వేయడం కంటే, దర్శకుడు చూపించిన కొత్త ప్రపంచాన్ని అనుభవించాలని ఆమె అభిప్రాయపడ్డారు.మరోవైపు స్వీడన్‌కి చెందిన ప్రముఖ డీజే విడోజీన్ ..తాను 2024లో రూపొందించిన మ్యూజిక్ బీట్‌ని థమన్ కాపీ చేశారని ఆరోపించారు. ప్రభాస్ నటన అద్భుతమని కొనియాడుతూనే మ్యూజిక్ కాపీ చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ చెప్పు చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మొత్తానికి ‘ది రాజా సాబ్’పై వస్తున్న పోలికల వ్యాఖ్యలకు చిత్రబృందం నుంచి స్పష్టమైన సమాధానం రావడంతో, ఈ చర్చకు కొంతవరకు ముగింపు పడినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందన్నదే అన్న అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.