మనేసర్: అదో వైన్ షాపు..! అన్ని వైన్స్లలో లాగానే ఆ వైన్స్లో కూడా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇంతలో కస్టమర్ల లాగానే ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తుల్లో , తలకు తెల్లటి వస్త్రాలు చుట్టుకుని వచ్చారు. మద్యం కొనుగోలుకు వచ్చినట్టే కొన్ని క్షణాలు కౌంటర్లో సిబ్బందితో మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కసారిగా వైన్స్ సిబ్బందిపైన, కస్టమర్లపైన విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పారిపోయారు. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ జిల్లాలోని మనేసర్ పట్టణంలోగల పచ్గావ్ చౌక్ ఏరియాలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఎవరైనా నిందితులకు సంబంధించిన సమాచారం ఇస్తే రూ.50 నజరానా అందజేస్తామని ప్రకటించారు.
కాగా, వారం రోజుల క్రితం వైన్స్ షాపు యజమానికి, అతని సోదరునికి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. దీనిపై అన్నదమ్ములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ రోజు బెదిరింపులకు పాల్పడిన ఆగంతకులే కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
#WATCH | One person died, two injured after two people opened fire at a wine shop in Haryana’s Gurugram yesterday pic.twitter.com/IAMjosFlO4
— ANI (@ANI) June 17, 2023