Omar Abdullah : ఇవాళ ఉదయం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu and Kashmir CM) గా ప్రమాణస్వీకారం చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah).. మధ్యాహ్నం సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఆయన సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. అనంతరం జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలోని వివిధ విభాగాలకు చెందిన సెక్రెటరీలతో ఒమర్ సమావేశమయ్యారు.
జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. కాగా ఉదయం 11.30 గంటలకు ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
శ్రీనగర్‌లోని ‘షేర్ ఇ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్’లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, లోక్‌ససభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్, సీపీఐ నేత డీ రాజా కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ఒమర్ అబ్దుల్లా గతంలో కూడా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీ, పీడీపీ కూటమి అక్కడ అధికారం చేపట్టింది.
2018లో కూటమి సర్కారు కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత కేంద్రం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దుచేసింది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఇప్పుడే తొలిసారిగా జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
#WATCH | Srinagar: JKNC vice president takes charge as the Chief Minister of Jammu & Kashmir at the Secretariat and holds a meeting with secretaries of various departments.
(Video: J&K CMO) pic.twitter.com/TfjWksOHpa
— ANI (@ANI) October 16, 2024