రాంచి: జార్ఖండ్ రాష్ట్రం డియోగఢ్ నియోజకవర్గంలోని బాబా బైథ్యనాథ్ జ్యోతిర్లింగ్ ఆలయాన్ని తెరువాలని డిమాండ్ చేస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నారాయణ దాస్ వినూత్న నిరసన చేపట్టారు. నుదిటికి విభూది, మెడలో ఉదారంగు వస్త్రం, ఆకుపచ్చని ప్లాస్టిక్ ఆకుల దండ, ఓ చేతిలో ఢమరుకం, మరో చేతిలో కమండలం ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఢమరుకం వాయిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
#WATCH | Jharkhand: Narayan Das, BJP MLA from Deoghar, reaches State Assembly premises with a 'damru', demanding reopening of Baba Baidyanath dham in his constituency. pic.twitter.com/VuQnNpL66K
— ANI (@ANI) September 7, 2021
అనంతరం మీడియాతో మాట్లాడిన నారాయణ దాస్.. బాబా బైథ్యనాథ్ జ్యోతిర్లింగ్ ఆలయం కేవలం డియోగఢ్లోనేగాక దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆలయమని, వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఆలయానికి వస్తుంటారని చెప్పారు. అంతేగాక, ఆలయాన్ని తెరిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని నారాయణ దాస్ తెలిపారు. బాబా బైథ్యనాథ్ ఆలయాన్ని తక్షణమే తెరువాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేందుకే తాను ఈ వేషధారణలో అసెంబ్లీకి వచ్చానని నారాయణ దాస్ చెప్పారు. లేదంటే అసెంబ్లీ సమావేశాలు ముగియగానే డియోగఢ్ నియోజకవర్గంలో తన నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.
ఇదిలావుంటే, బైథ్యనాథ్ ఆలయాన్ని తెరువాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అయితే ఆ పిటిషన్పై అత్యవసర విచారణ జరుపాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అర్జంట్ లిస్టింగ్ నుంచి పిటిషన్ను తప్పించింది.