Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. వాయనాడ్ (Wayanad) లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, తల్లి సోనియాగాంధీ (Sonia Gandhi), లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, సోదరుడు రాహుల్‌గాంధీ (Rahul Gandhi), కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) సమక్షంలో ప్రియాంకాగాంధీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
#WATCH | Kerala: Congress leader Priyanka Gandhi Vadra files her nomination for Wayanad parliamentary by-election, in the presence of CPP Chairperson Sonia Gandhi, Congress President Mallikarjun Kharge, Leader of Opposition Rahul Gandhi and Congress general secretary KC… pic.twitter.com/ykU6ljJkrm
— ANI (@ANI) October 23, 2024
అంతకుముందు ప్రియాంకాగాంధీ తన సోదరుడు రాహుల్‌గాంధీ, పలువురు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి వాయనాడ్ నియోజకవర్గంలోని కల్పెట్ట పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ షో అనంతరం కల్పెట్టలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంకాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రసంగించారు. వాయనాడ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. వాయనాడ్ ప్రజలకు తమ కుంటుంబం రుణపడి ఉన్నదని అన్నారు.
కాగా ప్రియాంకాగాంధీ తొలిసారి ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగారు. ఆమె ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో కూడా ప్రత్యక్షంగా పోటీపడలేదు. అయితే గత 35 ఏళ్లుగా దేశంలో జరిగిన వివిధ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు తొలిసారి ఆమె తనకోసం తాను ప్రచారం చేసుకోబోతున్నారు. కాగా వాయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.