న్యూఢిల్లీ: చెట్ల నరికివేతకు అనుమతి అవసరమన్నది తనకు తెలియదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi Lt Governor) పేర్కొన్నారు. బుధవారం అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తెలిపారు. ఢిల్లీలోని రిడ్జ్ ప్రాంతంలో 1,100 చెట్లను నరికివేయడంపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఆయన తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ ఎల్జీ సక్సేనాను సుప్రీంకోర్టు కోరింది. దీనిపై ఆయన స్పందించారు. చెట్ల నరికివేతకు చట్టపరమైన అనుమతి గురించి ఆ సైట్లో ఉన్న ఎవరూ కూడా తనకు తెలియజేయలేదని అన్నారు. చెట్ల నరికివేత, వాటి తరలింపునకు సంబంధిత అథారిటీ నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లుగా తనకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులను తాను ఆదేశించినట్లు తెలిపారు. చెట్లను నరికివేయడానికి అటవీ శాఖ అనుమతి మాత్రమే అవసరమని తాను భావించానని, అందుకే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు 2024 మార్చిలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) నుంచి ప్రతిపాదన వచ్చినప్పుడే చెట్లను నరికేందుకు కోర్టు అనుమతి అవసరమన్న విషయం తనకు తెలిసిందని ఎల్జీ సక్సేనా తెలిపారు. అయితే చెట్లు నరకడం తప్పు అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల కోసం వారు చేసిన పని నిజాయితీగా ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
మరోవైపు ఈ అంశంపై దర్యాప్తు కోసం డీడీఏ ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ఆ సంస్థ ఛైర్పర్సన్ కూడా అయిన సక్సేనా సుప్రీంకోర్టుకు తెలిపారు. చెట్ల నరికివేతకు ఇష్టానుసారంగా అనుమతులిచ్చిన అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 26 వరకు డీడీఏ వైస్ చైర్పర్సన్ ఎయిమ్స్‌లో చికిత్స పొందారని, ఈ నేపథ్యంలో ఆయనపై చేపట్టిన కోర్టు ధిక్కార కేసును ఉపసంహరించాలని సుప్రీంకోర్టును ఎల్జీ అభ్యర్థించారు.