పట్నా: దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అగ్ర నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం బీజేపీ నేతల ఇండ్లలో కుక్క కూడా చావలేదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే రాజస్థాన్లో చేసిన వ్యాఖ్యలపై.. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పార్లమెంట్లో గగ్గోలు పెట్టారు.
ఆ సందర్భాన్ని ఉద్దేశించి బీజేపీపై తేజస్వి ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న (మంగళవారం) కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ బీజేపీ పాలిత రాష్ట్రాలే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయంటూ చేసిన అబద్దపు వ్యాఖ్యలపై పార్లమెంట్లో ఎవరూ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. తాము రాష్ట్రంలో 75,500 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఎవరూ ఎందుకు మాట్లాడరని నిలదీశారు.
అదేవిధంగా బీహార్లో కల్తీ మద్యం సేవించి 70 మందికిపైగా మరణించిన ఘటనపై బీజేపీ నేతలు చేస్తున్న రాద్దాంతం మీద కూడా తేజస్వి యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీహార్ కల్తీ మద్యం మరణాల గురించి మాట్లాడుతున్న బీజేపీ.. నాలుగు నెలల క్రితం జరిగిన కల్తీ మద్యం మరణాల గురించి ఎందుకు మాట్లాడలేదని, అప్పుడు బీజేపీ చేవ చచ్చిందా..? తేజస్వి ప్రశ్నించారు.
గత జూలైలో గుజరాత్లో కల్తీ మద్యం సేవించి 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఉద్దేశించి తేజస్వి యాదవ్ పై వ్యాఖ్య చేశారు. గుజరాత్లో కల్తీ మద్యం మరణాలపై మాట్లాడని బీజేపీ నేతలు, బీహార్లో కల్తీ మద్యం మరణాలపై రభస చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.