తిరువనంతపురం : కేరళలో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం), గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. రెండు రోజల క్రితం తనను ‘కేర్ టేకర్ గవర్నర్’గా పేర్కొన్న సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీ గోవిందన్ను అప్రాధాన్య వ్యక్తిగా గవర్నర్ అభివర్ణించారు.
తిరువనంతపురం ఎయిర్పోర్టులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ విషయాన్ని అయినా తాను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తోనే నేరుగా వ్యవహరిస్తానే తప్ప ఇలాంటి ‘జానీ’లతో కాదని గోవిందన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గోవిందన్ విమర్శలు చూస్తుంటే రాజ్యాంగం పట్ల ఆయనకు ఉన్న అవగాహన ఏమిటో అర్థమవుతున్నదని అన్నారు. కాగా, రా్రష్ట్రంలో జరుగుతున్న దేశ వ్యతిరేక కార్యకలాపాలపై తనకు నివేదిక ఇవ్వాలంటూ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు గవర్నర్ సమన్లు జారీ చేయడంతో ఇది మరింత తీవ్రమైంది.