న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వక్ఫ్ (సవరణ) బిల్లుపై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రూపొందించిన నివేదిక సోమవారం లోక్‌సభ ముందుకు రానున్నది. జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్, సభ్యుడు సంజయ్ జైశ్వాల్ సోమవారం లోక్‌సభలో నివేదికను ప్రవేశపెడతారని పేర్కొంటూ లోక్‌సభ సచివాలయం శనివారం బులెటిన్ జారీచేసింది.
కమిటీ తన నివేదికను గురువారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించింది. అధికార బీజేపీ సభ్యులు సూచించిన సిఫార్సులతో కూడిన నివేదికను కమిటీ గత బుధవారం మెజారిటీ ఓటుతో ఆమోదించింది. కాగా, తమ సూచనలను విస్మరించిన కమిటీ నివేదికను ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. ఈ ప్రక్రియను వక్ఫ్ బోర్డులను నాశనం చేసే ప్రయత్నంగా వారు అభివర్ణించారు. నివేదికపై ప్రతిపక్ష సభ్యులు తమ డిస్సెంట్ నోట్‌ను సమర్పించారు.