న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక సోమవారం లోక్‌సభ ముందుకు రాబోతున్నది. జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. జేపీసీ ముందు ఇచ్చిన సాక్ష్యాల రికార్డ్‌ను కూడా సభలో వారు ప్రవేశపెట్టబోతున్నారు. జనవరి 29న ముసాయిదా నివేదికను కమిటీ ఆమోదించింది. దీంట్లో ముసాయిదా బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదించినట్టు చైర్మన్ జగదంబికా పాల్ చెప్పారు. ముసాయిదా బిల్లులోని 14 క్లాజులకు సభ్యులు సవరణలు సూచించారని తెలిపారు. మెజార్టీ ఓటుతో వీటికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. కమిటీలోని విపక్ష సభ్యులు కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.