న్యూఢిల్లీ : గత వారం పార్లమెంట్లో ఆమోదం పొందిన వక్ఫ్ (సవరణ) చట్టం దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వక్ఫ్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ దాఖలైన సుమారు 10కి పైగా పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 15 నుంచి విచారించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసే ముందు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ మంగళవారం కేంద్రం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. వక్ఫ్ నిరసనలు హింసాత్మకం వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మంగళవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడానికి ప్రయత్నించారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు.