Waqf Act : వక్ఫ్ సవరణ చట్టం (Waqf act) ను సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వం (Union govt) సుప్రీంకోర్టు (Supreme Court) లో కౌంటర్ అఫిడవిట్ (Counter affidavit) దాఖలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం-2025 చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఈ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ చట్టంలో చేసిన పలు సవరణలు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను హరిస్తాయనే తప్పుడు ప్రాతిపదికపై పిటిషన్లు ఉన్నాయని ఆరోపించింది.
ఆర్టికల్ 32 ప్రకారం ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు సమీక్షించవచ్చని తెలిపింది. కాకపోతే పార్లమెంటరీ ప్యానెల్ ద్వారా సమగ్రమైన, లోతైన, విశ్లేషణాత్మక అధ్యయనం అనంతరమే వక్ఫ్ చట్టానికి సవరణలు చేశామని తెలిపింది. గతంలో ఉన్న నిబంధనలతో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం జరిగిందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ మేరకు 1332 పేజీలతో దాఖలు చేసిన ప్రాథమిక కౌంటర్ అఫిడవిట్లో ఈ చట్ట సవరణలను సమర్థించుకుంది.
2013 తర్వాత ఆశ్చర్యకరంగా వక్ఫ్ భూమి భారీగా పెరిగిందని పేర్కొంటూ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ షేర్షా సీ షేక్ మొహిద్దీన్ అఫిడవిట్ దాఖలు చేశారు. వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ 72 పిటిషన్లు దాఖలు కాగా.. వాటిపై ఏప్రిల్ 17న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ముందు దీనిపై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా న్యాయస్థానం అందుకు అంగీకరించింది.
ఈ నేపథ్యంలో తాజాగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటీఫై చేయబోమని కేంద్రం కోర్టుకు తెలిపింది. అయితే అప్పటివరకు వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది.