భోపాల్: భారీ వర్షాలకు ఇంటి గోడ కూలింది. (7 Killed In Wall Collapse) ఆ ఇంట్లో నిద్రించిన 9 మంది కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు వ్యక్తులను స్థానికులు కాపాడారు. ఇద్దరు పిల్లలతో సహా ఏడుగురు మరణించారు. శిథిలాలను పూర్తిగా తొలగించిన తర్వాత వారి మృతదేహాలను వెలికితీశారు. మధ్యప్రదేశ్లోని దాతియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖల్కాపురా ప్రాంతంలో పాత ఇంటి గోడ పగుళ్లిచ్చింది. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆ గోడతో సహా ఇల్లు కూలిపోయింది. ఆ ఇంట్లో నిద్రించిన వంశ్కార్ కుటుంబానికి చెందిన తొమ్మిది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.
కాగా, స్పందించిన స్థానికులు ఇద్దరు వ్యక్తులను కాపాడారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఇరుకైన మార్గం కావడంతో జేసీబీ చేరలేకపోయింది. దీంతో శిథిలాల తొలగింపు సాధ్యం కాకపోవడంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించారు. తొలుత ఇద్దరి మృతదేహాలను, శిథిలాలను పూర్తిగా తొలగించిన తర్వాత ఐదుగురి మృతదేహాలను వెలికి తీశారు.
మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన బాధిత కుటుంబాల మృతుల్లో ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.