Supreme Court | వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఏప్రిల్ 15న విచారించే అవకాశం ఉంది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ (సవరణ చట్టం) 2025కు సంబంధించి సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం 2025 చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేసే ముందు విచారణ జరపాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. రాజకీయ నాయకులు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, జమియత్ ఉలామా-ఎ-హింద్ తదితర సంస్థల పిటిషన్లతో సహా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పది కంటేఎక్కువ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
కొత్తగా అమలులోకి వచ్చిన చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను దాఖలు చేసిన న్యాయవాదులు ఏప్రిల్ 15న బెంచ్ ముందు విచారణకు జాబితా చేయబడే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఇది ఇంకా సుప్రీంకోర్టు వెబ్సైట్లో కనిపించడం లేదు. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, మహ్మద్ జావేద్, ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆర్జేడీ ఎంపీలు మనోజ్ ఝా, ఫయాజ్ అహ్మద్, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కూడా ఈ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 7న ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌కు పిటిషన్లను జాబితా చేసేందుకు పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. జమియత్ ఉలామా-ఎ-హింద్ తరఫున కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకు హాజరవుతున్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున కేవియట్ దాఖలు చేయడం అనేది ఒక చట్టపరమైన ప్రక్రియ.
ఇది ఒక కేసులో ఏదైనా ఉత్తర్వు జారీ చేసే ముందు ఒక వ్యక్తి లేదంటే సంస్థ తన వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరడమే. దాంతో ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉండదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఆమోదం తెలిపిన బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5న ఆమోదం తెలిపారు. రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఏప్రిల్ 4న రాజ్యసభ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఏప్రిల్ 3న సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లును ఆమోదించింది. 288 మంది ఎంపీలు అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు.