Parag Desai | అహ్మదాబాద్ : వాఘ్ బక్రీ టీ గ్రూపు యజమాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయి(49) కన్నుమూశారు. బ్రెయిన్ హెమరేజ్ కారణంగా ఆదివారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని పరాగ్ కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
మార్నింగ్ వాక్ నిమిత్తం అహ్మదాబాద్‌లోని తన ఇంటి సమీపంలో ఉన్న పార్క్‌కు అక్టోబర్ 15న పరాగ్ దేశాయి వెళ్లారు. వాకింగ్ చేస్తుండగా, వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు యత్నించాయి. దీంతో కుక్కల నుంచి తప్పించుకునేందుకు పరాగ్ ప్రయత్నించగా, కింద పడిపోయారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన అపస్మారకస్థితిలోకి వెళ్లిపోవడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం అహ్మద్బాద్లోని జైదాస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ బ్రెయిన్ హెమరేజ్ కారణంగా ఆదివారం సాయంత్రం పరాగ్ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.
వాఘ్ బక్రీ టీ కంపెనీ సిబ్బంది.. పరాగ్ దేశాయి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరాగ్ మరణం విచారకరం అని పేర్కొన్నారు. ఆయన మరణంతో తాము ఒంటరి అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. పరాగ్ ఆత్మకు శాంతి చేకూరాలని సిబ్బంది ప్రార్థించారు.